Thursday, November 21, 2019

ఆర్టీసీ ప్రైవేటీకరణ మంచిదే - హైకోర్టు

ఆర్టీసీ ప్రైవేటీకరణ మంచిదే -  హైకోర్టు
20-11-2019 03:43:29

ఇప్పుడు నడుస్తున్న ధోరణి అదే
రైళ్లు, విమానాల్లో ప్రైవేటు వచ్చేసింది
ప్రపంచీకరణ వేగంగా జరుగుతోంది
మనం 1947 నాటి పరిస్థితుల్లో లేం
రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుపట్టలేం
దీంట్లో చట్టాల ఉల్లంఘన జరగలేదు
రూట్ల ప్రైవేటుపై హైకోర్టు వ్యాఖ్యలు
ప్రైవేటీకరణ నడుస్తున్న ట్రెండ్‌. 1947 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 1991లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలతోనే గుత్తాధిపత్యం పోయింది. పెట్టుబడిదారీ చట్టాలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పులు వస్తున్నాయి. వేగంగా ప్రపంచీకరణ జరుగుతోంది. పోటీతత్వం ఉంటే సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ జరుగుతున్నపుడు స్వాగతించాలి.
హైకోర్టు ధర్మాసనం

హైదరాబాదు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో 5,100 రూట్‌ పర్మిట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ దశలో తప్పుపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేబినెట్‌ నిర్ణయంలో 5,100 రూట్‌ పర్మిట్లను ప్రైవేటుకు ఇవ్వడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని మాత్రమే ఉందని తెలిపింది. రూట్ల ప్రైవేటీకరణపై మాజీ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నప్పుడే ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం తీసుకోవడం సరి కాదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు. మోటారు వాహనాల చట్టం(ఎంవీ యాక్టు) పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీ యాక్టు)లోని పలు సెక్షన్లను ఉటంకించారు. పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాలను ఏ ఉద్దేశంతో చేశారో సరిగ్గా అన్వయించుకోవాలని సూచించింది. ప్రభుత్వం రూట్ల ప్రైవేటీకరణకు చర్యలు ప్రారంభించాలని మాత్రమే నిర్ణయిచిందని తెలిపింది. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది. ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 102లో ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఏదేని నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి ఉంటాయని పేర్కొంది.

‘‘చట్ట నిబంధనల ప్రకారం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలంటే... చట్ట సవరణకు సంబంధించి ముందు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దీనిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు స్థానిక పత్రికల్లో 30 రోజులు గడువు ఇస్తూ ప్రకటన ఇవ్వాలి. దీనిపై అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ నిర్ణయం వల్ల నష్టపోయే ఆర్టీసీ సంస్థ అభిప్రాయాన్ని తీసుకోవాలి... కేబినెట్‌ నిర్ణయం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది’’ అని గుర్తు చేసింది. ఆర్టీసీ చట్టంలోని 71, 72 సెక్షన్లను ఉటంకిస్తూ ఆర్టీసీ ఏర్పాటు చేయడానికి మునుపు ప్రైవేటు ఆపరేటర్ల చేతిలో ఉన్న రూట్లను ఆర్టీసీకి బదలాయించేందుకు ఉద్దేశించినవని తెలిపింది. వాటిలో కొన్ని రూట్లను ప్రైవేటీకరించడానికి, స్టేజ్‌ క్యారేజ్‌ పర్మిట్‌ ఇచ్చేందుకు ఉన్న నిబంధనలు పాటించాల్సి ఉందని తెలిపింది. రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఆర్టీసీ యాక్టులోని సెక్షన్‌ 71, 71, 102 నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని ధర్మాసనం ప్రస్తావించింది.

ఉల్లంఘనలు ఉంటే అప్పుడు న్యాయ సమీక్ష చేయవచ్చని తెలిపింది. ప్రైవేటీకరణ నడుస్తున్న ట్రెండ్‌ అని ధర్మాసనం అభిప్రాయపడింది. 1947 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంది. 1991లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలతోనే గుత్తాధిపత్యం పోయిందని తెలిపింది. పెట్టుబడిదారీ చట్టాలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పులు వస్తున్నాయని గుర్తు చేసింది. వేగంగా ప్రపంచీకరణ జరుగుతోందని, పోటీతత్వం ఉంటే సౌకర్యాలు మెరుగవుతాయని అభిప్రాయపడింది. ఒకప్పడు ఎయిర్‌ ఇండియా ఒక్కటే విమానయానంలో ఉండేదని, రాను రాను పలు ప్రైవేటు ఎయిర్‌ వేస్‌ వచ్చాయని గుర్తు చేసింది. వాటిలో కొన్ని నిలబడగలిగాయని, కింగ్‌ ఫిషర్‌ వంటి సంస్థలు కనుమరుగయ్యాయని ప్రస్తావించింది. దేశంలో రైల్వే ఒక్కటే ప్రభుత్వ రంగంలో ఉన్న రవాణా సంస్థ అని తెలిపింది.

దాంట్లో కూడా ప్రైవేటు రైళ్లు రాబోతున్నాయని గుర్తు చేసింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ జరుగుతున్నపుడు స్వాగతించాలని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కల్పించుకుంటూ, ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు. ఇటువంటి నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండరాదన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఆయన వాదనలకు ధర్మాసనం అడ్డు చెప్పింది. ఆరోపణలు చేయదలచుకుంటే తగిన ఆధారాలు చూపాలంది. పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధి కోల్పేయేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది ప్రభాకర్‌ ప్రస్తావించారు. సుప్రీం తీర్పు ప్రతులను ధర్మాసనం పరిశీలనకు ఇచ్చారు. కోర్టు సమయం ముగియడంతో ఈ వ్యాజ్యంలో గతంలో ఇచ్చిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీని ఇలా నడపలేం : కేసీఆర్‌

ఆర్టీసీని ఇలా నడపలేం : కేసీఆర్‌
Nov 21, 2019, 22:24 IST
KCR Review Meeting On TSRTC Strike - Sakshi
ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి

సంస్థకు అంత శక్తి లేదు.. సర్కారూ భరించలేదు

చార్జీలు పెంచితే ప్రజలు బస్సెక్కని పరిస్థితి వస్తుంది

అన్నీ పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపిస్తాం

ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టు తీర్పు వచ్చే చాన్స్‌

ఆ తర్వాతే సర్కారు తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? సంస్థకు ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుగుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు 5,100 రూట్ల ప్రైవేటీకరణపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

అప్పుల కుప్ప..
‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉద్యోగులకు సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌ రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65–70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని ఈ సమావేశంలో ప్రభుత్వం చర్చించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథావిధిగా నడపం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, రామకృష్ణారావు, సందీప్‌ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఏజీ ప్రసాద్, అడిషనల్‌ ఏజీ రాంచందర్‌రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.