Monday, September 7, 2020

వీఆర్వోలు వద్దు

 వీఆర్వోలు వద్దు

గిర్దావర్ల నివేదికలే ప్రామాణికం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం


ఆ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది


వారి వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోంది


రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే..


గ్రామ వ్యవస్థ రద్దు ఒక్కటే మార్గం


వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలి


ఎమ్మార్వోకు కుదించి ఆర్డీవోకు అధికారాలు 


సంఘాలతో చర్చించాకే సంస్కరణలు


ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి


నేడో, రేపో సంఘాల బాధ్యులతో భేటీ


ఇతర శాఖలకు పంపితే ఊరుకోం


వీఆర్‌వోలపై అవినీతి ముద్ర సరికాదు


కొత్త చట్టంలోనూ మా పాత్ర: వీఆర్‌వోలు




హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన అన్నారు. రికార్డుల్లో పేర్లు చేర్చాలంటే డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు దిశగా ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏల)ను మాత్రం రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎం అన్నారు. వీరిలో అర్హత కలిగిన, విద్యావంతులైన వారికి ఇప్పటిదాకా వీఆర్‌వోలు నిర్వహించిన బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక ప్రతి తహసీల్దార్‌ ఆఫీసులో ప్రస్తుతం ఉన్న ఇద్దరు గిర్దావర్‌ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌)ల సంఖ్యను నాలుగుకు పెంచాలన్నారు.




ఇకపై ఆర్‌ఐల నివేదికలే ప్రామాణికంగా సేవలందాలని ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానున్న కొత్త రెవెన్యూచట్టంతోపాటు శాఖలో అమలు చేయాల్సిన సంస్కరణలపై ఆదివారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు/భూముల యాజమానులకు మరింత వేగంగా సేవలందించడానికిగాను రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌) యాక్ట్‌ను సులభతరం చేయాలన్నారు. దాంతోపాటు నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసె్‌సమెంట్‌ (నాలా)ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యవసాయ భూములను విచ్చలవిడిగా వ్యవసాయేతర భూములుగా మార్చకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. వివాదాల్లేని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగ్గానే.. రికార్డుల్లో మ్యుటేషన్‌ వేగంగా జరగాలని నిర్దేశించారు. 




తహసీల్దార్ల అధికారాలు కత్తెర..


రెవెన్యూశాఖలో ప్రధానంగా వీఆర్‌వోతోపాటు తహసీల్దార్‌ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయిందని, అపరిమిత అధికారాల వల్లే ఇలా తయారయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే తహసీల్దార్లకు ఉన్న అధికారాలను కుదించాలని నిర్దేశించారు. ప్రస్తుతం ఆర్డీవోలకు పరిమిత అధికారాలే ఉన్నాయని, డివిజనల్‌ స్థాయిలో కలెక్టర్‌కు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసే వ్యవస్థ లాగా ఇది మారిందని, దీనిని సంస్కరించాలని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను గణనీయంగా పెంచినందున వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.




కొత్తగా తేనున్న చట్టాల్లో తహసీల్దార్ల పాత్రను పరిమితం చేసేలా, ఆర్డీవోల అధికారాలను బలోపేతం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే రెవెన్యూ శాఖలో తేనున్న సంస్కరణల అమలుకు ముందు రెవెన్యూ సంఘాలన్నింటితో చర్చించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం కార్యాలయం ఆదివారం వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ల దాకా ఉన్న సంఘాల వివరాలతోపాటు బాధ్యుల సమాచారం తీసుకుంది. సోమవారం లేదా మంగళవారం ఆయా సంఘాలతో చర్చలు జరుపుతామని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాన సంఘం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రతినిధులతో కాసేపు సీఎం చర్చించారు. సంఘాలతో జరిగే సమావేశమే రెవెన్యూశాఖ భవితవ్యాన్ని నిర్దేశించనుంది.   









నయా భారత్ - జాతీయ స్థాయిలో కేసీఆర్‌ పార్టీ

 నయా భారత్

జాతీయ స్థాయిలో కేసీఆర్‌ పార్టీ

Sep 7 2020 @ 04:08AMహోంతెలంగాణ

పేరు ఇప్పటికే ఖరారు.. చురుగ్గా రిజిస్టర్‌ యత్నాలు


మమత, హేమంత్‌ వంటి నేతలతో మంతనాలు


బీజేపీ ‘అధ్యక్ష రాజకీయాల’ను అడ్డుకోవడానికే


జమిలి ఎన్నికల తర్వాత అధ్యక్ష పాలనకు కమలం పావులు


అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలే


అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం


అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘జాతీయ’ అరంగేట్రం


పార్టీపై న్యాయ కోవిదులు, నిపుణులతో మంతనాలు


నేటి టీఆర్‌ఎస్‌ఎల్పీలోనూ దీనిపై చర్చ.. తీర్మానం?




దేశం గురించి మాట్లాడడానికి కేసీఆర్‌ వెనకాడడు. తెలంగాణను మంచిగా చేశా. ఇక దేశం సమస్యలు తేలుస్తా. అవసరమైతే నేనే లీడ్‌ తీసుకుంటా. 




భారతీయ జీవిక, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయమే అత్యంత కీలకం. మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడి విధానం పాటించాలి.




జాతీయ నేతలుగా చెప్పుకునే వారిలో ఒకాయనేమో (రాహుల్‌ గాంధీ) ప్రధాని చోర్‌ అంటాడు. ప్రధానమంత్రేమో తల్లీకొడుకులు (సోనియా, రాహుల్‌) బెయిలుపై ఉన్నారని అంటాడు.




ప్రధానమంత్రి సడక్‌యోజన ఎవడిక్కావాలి. వీటిని నిర్మించేందుకు గ్రామ పరిపాలన వ్యవస్థలు లేవా?




దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 40 కోట్ల ఎకరాలు సాగవుతున్నాయని అనుకున్నా.. ఇంకా 30 వేల టీఎంసీల నీరు మిగులు ఉంటుంది. ఈ విషయాలు నేను చెప్పినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు.




- గతంలో వివిధ సందర్భాల్లో  కేసీఆర్‌ వ్యాఖ్యలు




హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కావాలని నినదించిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ప్రజల ఆకాంక్షలను ఆ రెండు పార్టీలూ నెరవేర్చలేకపోయాయని, కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన ఆయన.. ఇప్పుడు ‘నయా భారత్‌’ పేరిట జాతీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేసిన కేసీఆర్‌.. దానిని రిజిస్టర్‌ చేసే ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది.




అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీజేపీ ‘అధ్యక్ష రాజకీయాల’ను అడ్డుకునేందుకు ‘నయా భారత్‌’ పేరిట జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2022 చివర్లో కానీ, 2023లో కానీ జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా పావులు కూడా కదుపుతోంది. ఇందుకు ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆధ్వర్యంలో ఓ అంతర్గత కమిటీ వేసింది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ చురుగ్గా పరిశీలిస్తోంది. అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాలి. ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.




ఈ ఎజెండానే ధ్యేయంగా బీజేపీ ఇప్పటికే ‘ఒకే దేశం.. ఒకే విధానం’ పేరిట అడుగులు వేస్తోంది. ఈ నినాదంతోనే జమిలి ఎన్నికలకు వెళ్లడానికి పావులు కదుపుతోంది. ఆ ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచి.. రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష తరహా పాలనకు తెరతీయాలని భావిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్‌.. ముందుగానే అప్రమత్తమయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ‘ఒకే దేశం.. ఒకే విధానం’ నినాదానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడానికి పావులు కదుపుతున్నారని వివరించాయి. అయితే, సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా? లేక కలిసి వచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొంటారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు బీజేపీయేతర ప్రభుత్వాల సీఎంలతో కేసీఆర్‌ ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ వంటి నేతలతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.




నిజానికి, ‘నయా భారత్‌’ పేరిట ఇప్పటికే హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లకు చెందిన పార్టీలు జాతీయ స్థాయిలో పేరును రిజిస్టర్‌ చేయించినట్లు తెలిసింది. దాంతో, ఆయా పార్టీల నేతలతో కూడా టీఆర్‌ఎస్‌ నేతలు చర్చలు సాగించినట్లు సమాచారం. పార్టీ విధి విధానాలు, ఇతర అంశాలపై మాడభూషి శ్రీధరాచార్యులు వంటి తెలంగాణకు చెందిన న్యాయ కోవిదులు, ప్రముఖులతో కూడా కేసీఆర్‌ మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఎజెండా కూడా జాతీయ పార్టీ ఏర్పాటుకు కసరత్తు అని పార్టీ వర్గాలు వివరించాయి.




లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే..


‘కారు.. సారు.. పదహారు’ నినాదంతో గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే తన జాతీయ ఆకాంక్షలను  సీఎం కేసీఆర్‌ సుస్పష్టంగా వెల్లడించారు. పాకిస్థాన్‌ను నియంత్రించడంలో, జాతీయ భద్రతను కాపాడడంలో, అంతర్జాతీయ సంబంధాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణలో విజయవంతంగా అమలు చేసిన విద్యుత్తు, సాగునీటి విధానాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. 2,21,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 1,80,000 మెగావాట్లను మాత్రమే దేశం వినియోగించుకుంటోందని, సగం దేశం చీకట్లో మగ్గుతోందని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, కానీ, సాగునీటిని పూర్తిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు.




ఈ విషయాలను ప్రధాని మోదీకి తాను చెప్పినా పట్టించుకోలేదని కూడా ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని అప్పట్లోనే వెల్లడించారు. చెన్నై వెళ్లి స్టాలిన్‌, కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీ వంటి వారితో మంతనాలు కూడా జరిపారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఉప ప్రధాని పదవి కోరాలంటూ యోచనలు సాగాయని అప్పట్లో పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కేసీఆర్‌ ప్రధాని అయితే తప్పేంటి అంటూ ఆయన తనయ కవిత సహా టీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారమూ జరిగింది. అయితే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం రావడంతో కేసీఆర్‌ అడుగులు ముందుకు పడలేదు.




ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జీఎస్టీ పరిహారం ఇచ్చేది లేదని, కావాలంటే రాష్ట్రాలు అప్పులు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంపై మండిపడుతున్నారు. కరోనాను సమర్థంగా నిలువరించడంలోనూ కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, జాతీయ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించడం జాతీయ స్థాయిలోనూ తమకు అనుకూలంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలను కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.




కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించడం ఒకటైతే.. ముఖ్యమంత్రి హోదాలోనే కేంద్రంలో చక్రం తిప్పడం మరొకటని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్లినా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినా పూర్తిస్థాయి గౌరవం లభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇదే జరిగితే, రాష్ట్రంలో కేటీఆర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పటించడమే కాకుండా పాలనకు సంబంధించిన పూర్తి పగ్గాలను అప్పగించవచ్చని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశం సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్‌ జాతీయ రంగ ప్రవేశం, కొత్త పార్టీపై చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశంలో నేతలు ముక్త కంఠంతో సంఘీభావం తెలిపితే తీర్మానం చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని తెలిపాయి.

Friday, May 22, 2020

కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా

కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా
AddThis Sharing Buttons
Facebook Twitter LinkedIn Messenger Telegram
కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా


రాష్ర్టాల చేతుల్లోకి నగదు రావాలి కానీ కేంద్రం బిచ్చగాళ్లను చేసింది
రుణ పరిమితి పెంచారు.. కానీ దుర్మార్గపు ఆంక్షలు పెట్టారు
రూపాయి మెహర్బానీ కూడా లేదు కేంద్రం తన పరువును తీసుకున్నది
సంస్కరణలు అమలు చేయబోం సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ప్రభుత్వాలు. రాష్ట్రాలు సబార్డినేట్‌లు కావు. కేంద్రం కంటే రాష్ట్రాల పైనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పచ్చి దగా అని, నూటికి నూరు శాతం బోగస్‌ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రాష్ర్టాలను భిక్షగాళ్లలాగా చేసిందని మండిపడ్డారు. అప్పు తెచ్చుకొనేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచినట్టే పెంచి దరిద్రపుగొట్టు ఆంక్షలు విధించిందని ధ్వజమెత్తారు. ప్రజల మెడపై కత్తిపెడితే అప్పు తెచ్చుకొనేందుకు అనుమతినిస్తాననడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణం పొందేందుకు సంస్కరణలు అమలు చేయాలంటూ కేంద్రం విధించిన షరతులను అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు.

సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాకు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వట్టి డొల్ల. వందకు వంద శాతం బోగస్‌. ఇది నేను చెప్తలేను. సింగపూర్‌ నుంచి వచ్చే ఏషియన్‌ ఇన్‌సైడ్స్‌ అంతర్జాతీయ జర్నల్‌లో ‘హౌ పోటెంట్‌ ఇజ్‌ ది ఎకనామిక్‌ వ్యాక్సిన్‌ ఆఫ్‌ ఇండియా.. వట్టిదే బోగస్‌.. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్లు కూడా లేదు, అంత గాలి కథ’ అని వ్యాఖ్యానించింది. జపాన్‌ నుంచి వెలువడే ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ జర్నల్‌.. ‘డియర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌, ఇజ్‌ దిస్‌ ది ఎయిమ్‌ టూ రివైవ్‌ జీడీపీ.. ఆర్‌ టు రిలీజ్‌ ది 20 లాక్‌ క్రోర్‌ నంబర్‌.. ఇది అంకెల గారడీనా, లేక జీడీపీని పునరుద్ధరించడమా?’ అని ప్రశ్నించింది. ఇది చాలా దుర్మార్గమైన ప్యాకేజీ. పూర్తి ఫ్యూడల్‌ విధానంలో ఉంది.



నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాం. మేం అడిగింది.. కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక పరిస్థితిని నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి. అప్పుడు అది ప్రజల చేతుల్లోకి పోతుంది. మేం అది అడిగితే రాష్ట్రాలను భిక్షగాళ్లలాగా భావించి కేంద్రం ఏం చేసింది? ఇదేనా దేశంలో సంస్కరణలు అమలు చేసే పద్ధతి. ఎఫ్‌ఆర్‌బీఎం రెండు శాతం పెంచారు. దీని ద్వారా తెలంగాణకు 20 వేల కోట్ల రూపాయలు వస్తాయి. దీనికి కేంద్రం పెట్టిన షరతులు వింటే నవ్వుతారు. అది కూడా రాష్ట్రం కట్టుకునే అప్పు. వీళ్ల మెహర్బానీ ఒక్క రూపాయి కూడా లేదు. రుణ పరిమితి మాత్రమే పెంచింది. కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వదు. ఇందులో కూడా దరిద్రపుగొట్టు ఆంక్షలు ఉన్నాయి. రూ. 5 వేల కోట్లు ఇస్తారట.. దీని గురించి కొన్ని పత్రికలు రాశాయి. కొన్ని పత్రికలు ఎడిటోరియల్స్‌ కూడా రాశాయి. దీని ద్వారా తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని రాశాయి. తెలంగాణకు ఇప్పటికే 3.5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంది. ఇందులో కొత్తగా వచ్చేది ఏమీలేదు.



ప్రజల మెడపై కత్తి పెట్టాలా?
మిగిలిన వాటిల్లో రూ. 2,500 కోట్లకు ఒకటి చొప్పున సంస్కరణ ఆంక్ష పెట్టారు. కరెంటు సంస్కరణలు తీసుకొస్తే, ప్రజల మెడ మీద కత్తి పెడితే రూ. 2,500 కోట్లు ఇస్తారట, ఇది ప్యాకేజా? వాట్‌ ఇజ్‌ దిస్‌? దీన్ని ప్యాకేజీ అనరు. ఫెడరల్‌ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం ఇది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ఈ విధంగా వ్యవహరించవచ్చునా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత దుర్మార్గం. మార్కెట్‌ కమిటీల్లో కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలుచేస్తే మరో రూ.2,500 కోట్లు ఇస్తారట. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? మున్సిపాలిటీల్లో ఆదాయం పెంచితే, పన్నులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. దీన్ని ప్యాకేజీ అంటారా? ప్రోత్సహించే విధానమేనా ఇది? వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌కార్డు.. ఇందులో మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చాంపియన్లుగా ఉన్నాం. నాలుగింటిలో మూడు సంతృప్తి పరిస్తే మరో రూ.5వేల కోట్లు ఇస్తారట. ఇదేం బేరమండి?. ఇది పచ్చి మోసం.. దగా.. అంకెల గారడీ. అంతా గ్యాస్‌. కేంద్రం తన పరువును తానే తీసుకుం ది. భవిష్యత్‌లో ఇది విజన్‌ ప్యాకేజా లేక బోగస్‌ ప్యాకేజా అనేది ప్రజలకు తెలుస్తుంది.

కేంద్రం వైఖరి బాధాకరం
ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఐ రియల్లీ ఫీల్‌ పెయిన్‌ఫుల్‌. ఐ రియల్లీ ఫీల్‌ వెరీ సారీ. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్‌ ఫెడరలిజం అని ప్రధాని చెప్పారు. అది పూర్తిగా డొల్ల, బోగస్‌ అనేది ఇప్పుడు రుజువైంది. ఇంకెక్కడి ఫెఢరలిజం? దారుణంగా వ్యవహరిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇది చేస్తే పైసలిస్తం, అది చేస్తే పైసలిస్తం అనడం, పిల్లల కొట్లాటనా? ఇది వాంఛనీయం కాదు. ఇది అన్యాయం. మెడమీద కత్తి పెట్టి కరెంటు సంస్కరణలు అమలు చేస్తే నీకు బిచ్చం ఇస్తాం అనడం ప్యాకే జీనా? ఈ విధానం కరెక్టు కాదు. కరెం టుసంస్కరణలను మేం అమలుచేయం.

ముష్ఠి మాకొద్దు
క్యాబినెట్‌ సమావేశంలో చర్చించాం. సంస్కరణలు అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. ముష్ఠి రూ. 2500 కోట్లు తీసుకోం. కేంద్రంపై సమ యం వచ్చినప్పుడు పోరాటం చేస్తాం. శిశుపాలునికి కూడా వంద తప్పులు మన్నించారు కదా. ఏదైనా పండాలి. పండే సమయం వచ్చినప్పుడు ఎట్ల పం డుతదో ఎట్ల ఫైటింగ్‌ అయితదో సూడు’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానాలిచ్చారు. వేస్‌  అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ల పెంపు గురించి మాట్లాడుతూ.. ‘అది మా డబ్బే కదా.. మన ఓన్‌ సోర్స్‌. ఎప్పుడన్నా పైసలు వెళ్లకుండా ఉంటే ఎక్కువ డ్రా చేసుకునే అవకాశం. ఇది కూడా 500-600 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ప్రభుత్వాలు. రాష్ట్రాలు సబార్డినేట్‌లు కావు. కేంద్రం కంటే రాష్ట్రాల పైనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం.