Sunday, December 29, 2019

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం - KTR

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం
రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చిన నేత కేసీఆర్‌
మూడు రాజధానులపై ఏపీ ప్రజలే తేల్చుకుంటారు
ఏపీలో జగన్‌ పాలనకు శుభారంభం
పాతనగరానికి మెట్రో రైలు విస్తరణ
ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు  మంత్రి కేటీఆర్‌ జవాబులు

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో తెరాస వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌ను అడగండి (ఆస్క్‌ కేటీఆర్‌) పేరిట ఆదివారం ఆయన ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు దేశంలోనే ట్విటర్‌ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా, ప్రపంచవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. కేటీఆర్‌ సమాధానాల సారాంశం ఆయన మాటల్లోనే...
* రాజకీయాల్లో నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు కేసీఆరే. నాకు మంత్రి పదవి కన్నా పార్టీ పదవే విలువైంది. చేనేత వస్త్రాలకు నేను పెద్ద అభిమానిని.
* ఏపీలో మూడు రాజధానులపై ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్‌ పాలనకు శుభారంభమైంది.
* ప్రభుత్వ పనితీరుపై 60 లక్షల మంది తెరాస కార్యకర్తల నుంచి మాకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తోంది.
* హైదరాబాద్‌లో సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రారంభమైంది. త్వరలోనే మార్పు కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నగరానికి నీటి సమస్య తలెత్తదు.
* ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేసింది. తెలంగాణపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు. రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.
* కొంపల్లి ఐటీపార్కుకోసం భూసేకరణ చేస్తు న్నాం. ఔషధనగరిని 2020లో ప్రారంభిస్తాం.
* చార్మినార్‌, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం. యూరప్‌, అమెరికా వంటి ప్రాంతాల నుంచి నగరానికి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాల కోసం కృషి చేస్తాం.
* హైదరాబాద్‌లో కొత్తగా 50 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్స్‌ నిర్మాణాలకు ఆమోదం తెలిపాం. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుంది.
* గోపనపల్లిలో పెరుగుతున్న గేటెడ్‌ కమ్యూనిటీలకు ఆర్థిక జిల్లా నుంచి రోడ్లను నిర్మిస్తాం.

కొన్ని ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న:  సినిమాల్లో నటించి సామాజిక సందేశం ఇవ్వవచ్చు కదా?
కేటీఆర్‌: మీకు ధన్యవాదాలు. నాకు పూర్తికాలపు ఉద్యోగం (ఫుల్‌ టైం జాబ్‌) ఉన్నది.

ప్రశ్న: ఏపీలో మీ పార్టీని విస్తరించండి. ఇక్కడ రెండు పార్టీలు వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నాయి. మీరు వస్తే బాగుంటుంది?
కేటీఆర్‌: కృతజ్ఞతలు మిత్రమా... ఉద్యమ సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వమే లేదన్నారు. ఇప్పుడు తెరాసను పొరుగు రాష్ట్రాలకు విస్తరించమని అంటున్నారు. ఏపీ ప్రజల నుంచి ఇలాంటి స్వాగతం లభించటమనేది మా సీఎం కేసీఆర్‌ గొప్ప నాయకత్వానికి నిదర్శనం.

No comments:

Post a Comment