Monday, September 7, 2020

వీఆర్వోలు వద్దు

 వీఆర్వోలు వద్దు

గిర్దావర్ల నివేదికలే ప్రామాణికం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం


ఆ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది


వారి వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోంది


రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే..


గ్రామ వ్యవస్థ రద్దు ఒక్కటే మార్గం


వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలి


ఎమ్మార్వోకు కుదించి ఆర్డీవోకు అధికారాలు 


సంఘాలతో చర్చించాకే సంస్కరణలు


ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి


నేడో, రేపో సంఘాల బాధ్యులతో భేటీ


ఇతర శాఖలకు పంపితే ఊరుకోం


వీఆర్‌వోలపై అవినీతి ముద్ర సరికాదు


కొత్త చట్టంలోనూ మా పాత్ర: వీఆర్‌వోలు




హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన అన్నారు. రికార్డుల్లో పేర్లు చేర్చాలంటే డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు దిశగా ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏల)ను మాత్రం రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎం అన్నారు. వీరిలో అర్హత కలిగిన, విద్యావంతులైన వారికి ఇప్పటిదాకా వీఆర్‌వోలు నిర్వహించిన బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక ప్రతి తహసీల్దార్‌ ఆఫీసులో ప్రస్తుతం ఉన్న ఇద్దరు గిర్దావర్‌ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌)ల సంఖ్యను నాలుగుకు పెంచాలన్నారు.




ఇకపై ఆర్‌ఐల నివేదికలే ప్రామాణికంగా సేవలందాలని ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానున్న కొత్త రెవెన్యూచట్టంతోపాటు శాఖలో అమలు చేయాల్సిన సంస్కరణలపై ఆదివారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు/భూముల యాజమానులకు మరింత వేగంగా సేవలందించడానికిగాను రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌) యాక్ట్‌ను సులభతరం చేయాలన్నారు. దాంతోపాటు నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసె్‌సమెంట్‌ (నాలా)ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యవసాయ భూములను విచ్చలవిడిగా వ్యవసాయేతర భూములుగా మార్చకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. వివాదాల్లేని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగ్గానే.. రికార్డుల్లో మ్యుటేషన్‌ వేగంగా జరగాలని నిర్దేశించారు. 




తహసీల్దార్ల అధికారాలు కత్తెర..


రెవెన్యూశాఖలో ప్రధానంగా వీఆర్‌వోతోపాటు తహసీల్దార్‌ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయిందని, అపరిమిత అధికారాల వల్లే ఇలా తయారయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే తహసీల్దార్లకు ఉన్న అధికారాలను కుదించాలని నిర్దేశించారు. ప్రస్తుతం ఆర్డీవోలకు పరిమిత అధికారాలే ఉన్నాయని, డివిజనల్‌ స్థాయిలో కలెక్టర్‌కు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసే వ్యవస్థ లాగా ఇది మారిందని, దీనిని సంస్కరించాలని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను గణనీయంగా పెంచినందున వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.




కొత్తగా తేనున్న చట్టాల్లో తహసీల్దార్ల పాత్రను పరిమితం చేసేలా, ఆర్డీవోల అధికారాలను బలోపేతం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే రెవెన్యూ శాఖలో తేనున్న సంస్కరణల అమలుకు ముందు రెవెన్యూ సంఘాలన్నింటితో చర్చించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం కార్యాలయం ఆదివారం వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ల దాకా ఉన్న సంఘాల వివరాలతోపాటు బాధ్యుల సమాచారం తీసుకుంది. సోమవారం లేదా మంగళవారం ఆయా సంఘాలతో చర్చలు జరుపుతామని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాన సంఘం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రతినిధులతో కాసేపు సీఎం చర్చించారు. సంఘాలతో జరిగే సమావేశమే రెవెన్యూశాఖ భవితవ్యాన్ని నిర్దేశించనుంది.   









No comments:

Post a Comment